యేసుక్రీస్తు కేవలము యూదుల కొరకు మాత్రమే ఈ లోకమునకు వచ్చాడా?

0
233

మతోన్మాదులు, క్రీస్తు విరోధులు బైబిల్ నందలి వారికి నచ్చిన వచనాలను పట్టుకొని, వక్రీకరించి యేసుక్రీస్తు కేవలం యూదుల కొరకు మాత్రమే వచ్చాడని, మన భారతీయుల కొరకు రాలేదని తరచుగా వాదిస్తూ ఉంటారు.

వారు ఎంతగానో ఇష్టపడే రెండు బైబిల్ వచనాలు ఏమనగా:

మత్తయి 10:5,6:

యేసు ఆ పండ్రెండుమందిని పంపుచు, వారిని చూచి వారికాజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్లకుడి, సమరయుల యే పట్టణములోనైనను ప్రవేశింపకుడి గాని, ఇశ్రాయేలు వంశములోని నశించిన గొఱ్ఱల యొద్దకే వెళ్లుడి.

మత్తయి 15:24:

ఆయన ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను

మనం ముఖ్యముగా గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏదనగా యేసుక్రీస్తు ఇశ్రాయేలు జాతి అయిన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వంశస్థుడు. ఆయన ఇశ్రాయేలు జాతికి వాగ్ధానము చేయబడిన కుమారుడు.

అపో.కార్యములు 13:23:

అతని సంతానము నుండి దేవుడు తన వాగ్దానము చొప్పున ఇశ్రాయేలుకొరకు రక్షకుడగు యేసును పుట్టించెను.

సమస్త భూలోకము ఇశ్రాయేలు సంతానమందు ఆశీర్వదించబడుతుంది అని, అందుకే యేసయ్య మొదట యూదుల యొద్దకు పంపబడ్డాడు అని దేవుని ఊపిరి అయిన బైబిల్ నందు  చాల స్పష్టముగా తెలుపబడినది.

అపో.కార్యములు 3:25:

ఆ ప్రవక్తలకును, దేవుడు అబ్రాహాముతో నీ సంతానమందు భూలోకవంశములన్నియు ఆశీర్వదింపబడునని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకును, మీరు వారసులైయున్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి, మీలో ప్రతివానిని వాని దుష్టత్వమునుండి మళ్లించుటవలన మిమ్ము నాశీర్వదించుటకు ఆయనను మొదట మీయొద్దకు పంపెనని చెప్పెను.

ఇదే విషయాన్ని యేరుషలేము కాపురస్తుడైన సుమెయోను యేసయ్యను గూర్చి లోకమునకు ఈ విధముగా ప్రకటిస్తాడు.

లూకా 2: 30- 32 :

అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజలయెదుట సిద్ధపరచిన నీ రక్షణ నేనుకన్నులార చూచితిని.

పరిశుద్ధాత్మ వలన సుమెయోను పలికిన మాటలు గమనించండి, యేసయ్య కేవలం యూదుల కొరకు మాత్రమే కాదు సమస్త జనులను రక్షించేందుకు, అన్యజనులకు నిజమైన దేవుడిని బయలుపరచేందుకు వచ్చాడని స్పష్టం అవుతుంది. సుమెయోను పాత నిభందన గ్రంథములోని ఆ దేవుని వాగ్దానాన్ని గ్రహించగలిగాడు.

యెషయా 42:6:

గ్రుడ్డివారి కన్నులు తెరచుటకును బంధింపబడినవారిని చెరసాలలోనుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించువారిని బందీగృహములోనుండి వెలుపలికి తెచ్చుటకును. యెహోవానగు నేనే నీతివిషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొనియున్నాను నిన్ను కాపాడి ప్రజలకొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి యున్నాను.

ఇంకొక ముఖ్యమైన విషయమును మనము గమనించాలి. ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వందల సంత్సరాలుగా యేసయ్య కొరకు కనిపెట్టుకొని వున్నారు.

లూకా 2:26

అతడు ప్రభువుయొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మచేత బయలు పరచబడి యుండెను; ఆత్మవశుడై అతడు దేవాలయము లోనికి వచ్చెను.

లూకా 2:36 :

ఆమె (అన్న అను ఒక ప్రవక్త్రి ) కూడ ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి, యెరూషలేములొ విమోచనకొరకు కనిపెట్టుచున్నవారందరితో ఆయనను (యేసయ్యను) గూర్చి మాటలాడుచుండెను.

యోహాను 4:25, 26:

ఆ స్త్రీ ఆయనతో క్రీస్తనబడిన మెస్సీయ వచ్చునని నేనెరుగుదును; ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయునని చెప్పగా యేసునీతో మాటలాడు చున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను.

యోహాను 8:56:

మీ తండ్రియైన అబ్రాహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను; అది చూచి సంతోషించెను అనెను.

మరి ఇంతగా ఎదురుచూచుచున్న యూదుల కొరకు క్రీస్తు ముందుగా ఎందుకు రాకూడదు. ఆయన ప్రణాళిక ఇదే, దేవుని వాగ్ధానము చొప్పున ఆయన మొదట యూదుల కొరకు ప్రత్యక్షమై , వారిని వెలిగించి తద్వారా లోకమునందలి అందరిని, అన్ని జాతుల మతాల  ప్రజలను వెలిగించటమే. అంతే కాని ఆయన యూదుల దేవుడు మాత్రమే కాదు, ఆయన అందరికి ప్రభువు.

అపో.కార్యములు 10:35,36 :

ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొనువానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికి ప్రభువు.

దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక.