జన్మపాపము సత్యమైనది అయితే, యేసయ్య కూడా పాపి అవుతాడా?

0
444

ఈ ప్రశ్న తరచుగా తొడలు కొట్టే జయశాలి శిష్యుల దగ్గరి నుండి వింటూ ఉంటాము. ఇలాంటి వారి వలన క్రైస్తవులకు మేలు కంటే కీడే ఎక్కువగా జరుగుతుంది. కేవలం తెలుగు భాషలో తర్జుమా చేయబడిన బైబిల్ ను ఆధారం చేసుకొని, బైబిల్ మూల భాషలైన హీబ్రూ, అరామిక్, గ్రీకు భాషలను ప్రక్కకు నెట్టి, చిత్ర విచిత్రమైన క్రైస్తవ సిద్ధాంతాలను కనిపెట్టుటలో జయశాలి గారు ఆయనకు ఆయనే సాటి. సరే ఈ పీడి గారిని కాస్త ప్రక్కన పెట్టి అసలు విషయానికి వద్దాము.

జన్మపాపము అంటే ఏమిటి?

“ఆదిమానవుడు అయిన ఆదాము, తన అవిధేయత వలన చేసిన పాపము మూలముగా, మానవులందరూ జన్మతః పాపులము”

రోమీయులకు 5:12

“ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును లోకములో ఏలాగు ప్రవేశించెనో, ఆలాగుననే మనుష్యులందరు పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను.

 

రోమీయులకు 5:19

“ఏలయనగా ఒక మనుష్యుని అవిధేయతవలన అనేకులు పాపులుగా ఏలాగు చేయబడిరో, ఆలాగే ఒకని విధేయతవలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు”.

అయితే ఈ విషయాన్నీ తొడలు కొట్టే క్రైస్తవులు ఒప్పుకొనక, తమకు తామే నీతిమంతులమని తీర్పు తీర్చుకోనుచున్నారు. దీనిని ధృడపరచుకోవడానికి క్రొత్త వివాదం లేవనెత్తారు, అదేదనగా మానవుడు జన్మతః పాపి అయితే, యేసయ్య కూడా మానవుడిగా జన్మించాడు కదా, అంటే ఆయన కూడా పాపి అవుతాడా? అని.

సరే, వీరి వాదనకు సమాధానం చెప్పేందుకు ప్రయత్నిద్దాం. అసలు దేవుడు తినకూడదు, ముట్టకూడదు అన్న ఫలములు మొదట తిన్నది ఎవరు? హవ్వ కదా?

ఆదికాండము 3:6

“స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు, కన్నులకు అందమైనదియు, వివేకమిచ్చు రమ్యమైనదియునై యుండుట చూచినప్పుడు ఆమె దాని ఫలము లలో కొన్ని తీసికొని తిని తనతోపాటు తన భర్తకును ఇచ్చెను, అతడుకూడ తినెను;”

హవ్వ మొదట దేవుని ఆజ్ఞను అతిక్రమించి ఫలము తిన్ననూ, హవ్వ ద్వారా కాకుండా ఆదాము ద్వారా ఈ లోకములోనికి పాపము ప్రవేశించింది అని బైబిల్ మనకి బోధిస్తుంది.

1కోరింథీయులకు 15:21, 22

మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుష్యుని ద్వారానే మృతుల పునరుత్థానమును కలిగెను. ఆదామునందు అందరు ఏలాగు మృతిపొందుచున్నారో, ఆలాగుననే క్రీస్తునందు అందరు బ్రదికింపబడుదురు.

దీనిని బట్టి మానవులు జన్మతః పాపులు అని, ఆదాము చేసిన అతిక్రమము వలన మనమందరమూ పాపులుగా ఎంచబడ్డామని స్పష్టం అవుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏదనగా “పాపమూ కేవలం పురుషుని ద్వారా మాత్రమే ప్రవేశిస్తుంది అని స్పష్టముగా పరిశుద్ధ గ్రంధము ద్వారా తెలియపరచబడుతుంది. కనుకనే యేసయ్య జన్మపాపము లేకుండా జన్మించాడు ఏలయనగా అయన పురుషుని ప్రమేయము లేకుండా అధ్బుతమైన రీతిలో పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు.

మత్తయి 1:18

యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను.

అయితే ఇంతటి ప్రాధాన్యమున్న విషయాన్ని మాత్రము జయశాలి గారు గాని అయన శిష్యులు గాని, ముస్లిములు గాని గ్రహించలేకున్నారు.

దేవుడు మిమ్మును దీవించును గాక.