మనము ఈ భూమి మీద పుట్టుక మునుపే దేవుని వద్ద ఉన్నామా?

0
586

జయశాలి గారు, మరియు మార్మోనుల (MORMONS) అబద్ద బోధలలో ఇది ఒకటి. కేవలము బైబిల్ నందలి ఒక్క వచనమును పట్టుకొని, ఆ వచనము యొక్క భావమును వక్రీకరించి తనకు తానే ఆత్మజ్ఞాని అని భావించడం ఒక్క జయశాలి గారికే సాధ్యము. ఆయనకు కనిపించిన ఆ ఒక్క వచనము ఏదనగా కీర్తనలు 90: 3

కీర్తనలు 90: 3

నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

పై వచనము నందలి “నరులారా తిరిగి రండి” అన్న కొంత భాగాన్ని జయశాలి గారు తీసుకొని “నరులారా తిరిగి రండి” అంటే, మనము ఈ భూమి మీద పుట్టుక మునుపే “దేవుని” వద్ద ఉన్నాము, అందుకే మనలను మళ్ళీ తిరిగి రండి అని దేవుడు అంటున్నాడు అని జయశాలి గారు వాదిస్తూ ఉన్నారు. సరే ఈయన గారి వాదనలో ఎంత వరకు నిజము ఉన్నదో, ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా నడిపింపబడి అన్వేషిద్దాం.

కోరింతీయులకు వ్రాసిన పత్రికలో దేవుడు చాలా స్పష్టముగా ఈ క్రింది విధముగా బోధించాడు.

1కోరింథీయులకు 15:46-47

ఆత్మసంబంధమైనది మొదట కలిగినది కాదు, ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది; తరువాత ఆత్మసంబంధమైనది. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

ఇక్కడ రెండు విషయాలు మనము గమనించాలి.

  1. ప్రకృతిసంబంధమైనదే మొదట కలిగినది

మానవుని దేహము మొదటిగా ఆత్మ సంభందమైనది కాదు, అంటే జయశాలి గారు వాదిస్తునట్లుగా “మనము ఈ భూమి పుట్టుక మునుపు ఆత్మలుగా దేవుని వద్ద లేము”. మానవుడు మొదటిగా ప్రకృతి సంభందమైన మట్టితోనే రూపించబడ్డాడు.

  1. మొదటి మనుష్యుడు భూసంబంధియై మంటినుండి పుట్టిన వాడు, రెండవ మనుష్యుడు పరలోకమునుండి వచ్చినవాడు.

ఇక్కడ మొదటి మనుష్యుడు ఎవరు అనగా ఆదాము, రెండవ మనుష్యుడు ఎవరు అనగా మన యేసయ్య. ఇక్కడ గమనించారా మన యేసయ్య ఎంత గొప్ప అద్వితీయ లక్షణం కలిగి ఉన్నాడో, కేవలం కేవలం యేసయ్య మాత్రమే మొదటిగా పరలోక సంభందియైన వాడై ఉండి, మన వలే మట్టి శరీరమును ధరించాడు. అంతే గాని జయశాలి గారు వాదించే విధముగా మనము కూడా యేసయ్య వలె “ఈ భూమి మీద పుట్టుక మునుపే పరలోక సంభందియై, మట్టి శరీరమును ధరించలేదు”. యేసయ్య దేవుడై ఉండి, మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను (ఫిలిప్పీయులకు 2:7). ఇంత స్పష్టముగా యేసయ్య యొక్క కీర్తిని బైబిల్ ప్రకటిస్తుంటే, ఈ జయశాలి గారు మాత్రం ఈ యుగానికి నేనే యుగాపురుషుడను అన్నట్లు, యేసయ్యతో సమానముగా ఆయనను చేసుకుంటున్నాడు.

మరైతే జయశాలి గారికి ఇష్టమైన కీర్తనలు 90: 3 నందలి “నరులారా తిరిగి రండి” అంటే అర్ధం ఏమిటి?

కీర్తనలు 90: 3

నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు నరులారా, తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు.

పై వాఖ్యము మృతుల పునరుత్థానమును గూర్చినది. మొదటి భాగామును గమనించండి, “నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు”, ఈ వాఖ్య భాగము యొక్క అర్ధము ఏదనగా మనుష్యులు మరణించిన తరువాత సమాధి చేయబడతారు అని అర్ధము.

ఇక రెండవ భాగము “నరులారా తిరిగి రండి” అంటే అర్ధము ఏదనగా “మనుష్యులారా మీ యొక్క పునరుత్థాన దేహములతో తిరిగి మరలా జీవము పొందండి అని అర్ధము. అంతే గాని మనము ఈ భూమి మీద పుట్టుక మునుపే దేవుని వద్ద ఆత్మలుగా ఉన్నాము అని అర్ధము కాదు.

దేవుడు మిమ్మును దీవించును గాక.