ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు యేసయ్యకు తెలియదా! తెలియదు గనుక యేసయ్య దేవుడు కాదా?

0
467

ఈ క్రింది వచనము ముస్లిములకు, నాస్తికులకు, హైందవులకు చాలా ప్రీతికరమైన వచనము.

మత్తయి 24:36
‘అయితే ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. ‘

పచ్చకామెర్లు సోకిన వారికి, లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు, క్రైస్తవ్యాన్ని ఎలా నిందించాలి, ఎలా దూషించాలి అని లక్ష్యముగా పెట్టుకొని బైబిల్ చదివితే వారికి అన్ని విషయాలు ప్రతికూలముగానే కనపడుతాయి. ఎప్పుడెప్పుడు యేసయ్య దేవుడు కాదు అని, నిందించాలి అని ఎదురుచూసే వారికి పై వాఖ్యము చాలా ఇష్టమైనది. వీరి యొక్క వాదన ఏమనగా, ” దేవునికి సమస్తము తెలుసు కదా, కాని యేసయ్యకు మాత్రము ఆయన రాకడను గూర్చియు, ఆ గడియను గూర్చియు తెలియదు గనుక ఆయన దేవుడు కాదు కదా!” అనేది.

సరే ఆత్మ వలన వీరికి సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నిద్దాం. మనమందరమూ గుర్తు పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయము ఏదనగా, యేసయ్య కేవలము దేవుడు మాత్రమే కాదు, ఆయన సంపూర్ణముగా మానవుడు కూడాను. దీనిని Theological భాషలో “Hypostatic Union” అంటారు, అంటే ఒక్క మానవుని శరీరములో, పూర్తిగా సంపూర్ణముగా నూరుశాతము మనవ లక్షణములు మరియు దైవ లక్షణములు కలిగి ఉండుట.

హెబ్రీయులకు 2:9
‘దేవుని కృపవలన ఆయన ప్రతిమనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు , దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొంది నందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము౹ ‘

పై వచనము గమనించారా? యేసయ్య, తండ్రి అయిన దేవునితో సమానముగా పరమున ఉన్నవాడు అయినప్పటికీ, కేవలము మన కొరకు, ప్రతి మనుష్యుని కొరకు మానవునిగా మరణము పొందేందుకు, దేవుని చిత్తం నెరవేరెందుకు దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడ్డాడ అని స్పష్టం అవుతుంది.

ఫిలిప్పీయులకు 2:5-8
‘క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.౹ ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని౹ మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.౹ మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించు కొనెను.౹ ‘

పై వచనము గమనించండి, యేసయ్య దేవునితో సమానముగా ఉండుట భాగ్యమని ఎంచుకొనక , మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపము ధరించుకొని తనను తానే రిక్తునిగా చేసుకొనెను. ఇక్కడ చూడండి యేసయ్య ఏమంటున్నాడో, తనంతట తానే తనను రిక్తునిగా చేసుకున్నాడు (తగ్గించుకున్నాడు) అంటున్నాడు, అంటే ఆయన సంపూర్ణముగా దేవునితో సమానుడైన వాడు అయినప్పటికీ , ఆకారమందు మనుష్యుడుగా కనబడి తనను తగ్గించుకొన్నాడు అని స్పష్టం అవుతుంది. కనుక స్ప్రుష్టికి పునాది వేయబడక మునుపే, యేసయ్య ఉన్నవాడని, దేవుడైనప్పటికీ తనను తానూ తగ్గించుకొని మానవుడు అయ్యాడని స్పష్టముగా తెలియపరచబడుతుంది. యేసయ్య నూరు శాతము దేవుడు అని కొలొస్సయులకు వ్రాసిన పత్రిక ఎలుగెత్తి చెబుతుంది.

కొలొస్సయులకు 2:9
‘ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది;౹ ‘

యేసయ్య దేవుడైనప్పటికీ, మానవుడిగా ఈ లోకములో జన్మించాడు గనుక ఆయనకు కొన్ని పరిమితులు ఉంటాయి. అంటే దేవుడే చేయగలిగిన, ఆలోచించగలిగిన కొన్ని విషయాలు మానవుడిగా ఉన్న యేసయ్య చేయలేకపోవచ్చు, ఆలోచించలేకపోవచ్చు. అందుకే లూకా సువార్తలో మానవునిగా ఉన్న యేసయ్య యొక్క ఎదుగుదలను గూర్చి ఈ విదముగా వ్రాయబడినది.

లూకా 2:52
‘యేసు జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయయందును, మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.’

ఈ విధమైన పరిమిత జ్ఞానము కలిగి మనుష్యుడిగా ఉన్న యేసయ్యకు , ఆయన రాకడను గూర్చియు ఆ గడియను గూర్చియు ఆ సంధర్బములో మనుష్యుడిగా ఉన్న యేసయ్యకు తెలియకపోవచ్చును గాని, ప్రస్తుతము ఇప్పుడు పరలోకములో మహామహుడగు దేవుని సింహాసనముయొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైయున్న యేసయ్యకు ఆయన రాకడను గూర్చియు, గడియను గూర్చియు తెలియును. సమస్తము ఎరిగిన దేవుడు మన యేసయ్య.

యేసయ్యకు ఆ దినమును గూర్చియు, ఆ గడియను గూర్చియు యేసయ్యకు తెలియదు గనుక యేసయ్య దేవుడు కాదు అని క్రీస్తు విరోధులు చెబుతున్నారు కదా! మరైతే యేసయ్య సర్వజ్ఞాని అని లేఖనానుసరము నిరూపిస్తే యేసయ్య జీవము గల దేవుడు అని అంగీకరిస్తారా? చూద్దాం.

యోహాను 21:17
‘మూడవసారి ఆయన–యోహాను కుమారుడవైన సీమోనూ, నన్ను ప్రేమించుచున్నావా? అని అతనిని అడిగెను. – నన్ను ప్రేమించుచున్నావా అని మూడవసారి తన్ను అడిగినందుకు పేతురు వ్యసనపడి–ప్రభువా, నీవు సమస్తము ఎరిగినవాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే యెరుగుదువని ఆయనతో చెప్పెను.౹ ‘

పై వచనమును గమనించండి, 3 1/2 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉన్న పేతురు యేసయ్యను “సమస్తము తెలిసినవాడు” అని చెబుతున్నాడు. అందుకుగాను, యేసయ్య నాకు సమస్తము తెలుసా? అని పేతురుని ఏమైనా వారించాడా? లేదు కదా.

యోహాను 13:11
‘తన్ను అప్పగించువానిని ఎరిగెను గనుక– మీలో అందరు పవిత్రులు కారని ఆయన చెప్పెను. ‘

యేసయ్యకు తనను అప్పగించేవాడు “ఇస్కరియోతు యూదా” అని ముందే తెలియును. ఈ విధముగా ఎదుటి వారి మనస్సు నందు ఏ ఆలోచన ఉన్నదో గ్రహించటానికి ఒక్క దేవునికి మాత్రమే సాధ్యము.

కీర్తనలు 44:21
‘హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా? ‘

కనుక యేసయ్య జీవము గల దేవుడని క్రీస్తు విరోధులు అంగీకరిస్తారో లేదో చూడాలి.

అలాగే 3 1/2 సంవత్సరములు యేసయ్యతో పాటు ఉన్న శిష్యులు యేసయ్యను సమస్తము ఎరిగిన వాడిగా గుర్తించారు, అయితే ఇప్పుడున్న క్రీస్తు విరోధి ఆత్మ కలిగిన వారికీ మాత్రం ఈ విషయము మరుగు చేయబడినది.

యోహాను 16:30
‘సమస్తము ఎరిగినవాడవనియు, ఎవడును నీకు ప్రశ్నవేయ నగత్యము లేదనియు, ఇప్పుడెరుగుదుము; దేవుని యొద్దనుండి నీవు బయలుదేరి వచ్చితివని దీనివలన నమ్ముచున్నామని చెప్పగా౹ ‘

ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ నందు అనేక సందర్భాలలో యేసయ్య సమస్తము ఎరిగిన వాడిగా పేర్కొనబడినవి. కేవలము ఒక్క వచనమును వక్రీకరించి యేసయ్య సర్వజ్ఞుడు కాదు గనుక దేవుడు కాదు అని వాదిస్తే పొరపాటే అవుతుంది.

ఇక చివరిగా ముగించేముందు ఇంకో విషయము చెబుతాను, ప్రకటనలు గ్రంధములో ఈ విధముగా వ్రాయబడినది.

ప్రకటన 19:12
‘ఆయన నేత్రములు అగ్నిజ్వాల వంటివి, ఆయన శిరస్సుమీద అనేక కిరీటములుండెను. వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు;౹ ‘

పై వచనము గమనించారా? వ్రాయబడిన యొక నామము ఆయనకు కలదు, అది ఆయనకేగాని మరి ఎవనికిని తెలియదు, అని యేసయ్యను గూర్చి బైబిల్ బోధిస్తుంది. యేసయ్యకు మాత్రమే ఆ నామము తెలియును, ఎవరికీ తెలియదు అంటే “తండ్రి అయిన దేవునికి ఆ నామము తెలియదు” అని అర్ధమా? కాదు కదా. దీని అర్ధం ఏమిటంటే చాలా రహస్యమైనది అని, అంతేగాని త్రిత్వములోని దైవికమైన వ్యక్తులకు తెలియదు అని కాదు. అలాగే ఆ దినమును గూర్చియు ఆ గడియనుగూర్చియు తండ్రి మాత్రమే (యెరుగును) గాని, యే మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు అంటే, త్రిఏకదేవుడైన యేసయ్యకు తెలియదు అని అర్ధం కాదు, రహస్యమైనది అని అర్ధము.

దేవుడు మిమ్మును దీవించును గాక.