ప్రార్ధన ఎవరికి చేయాలి? తండ్రికా, కుమరుడికా, పరిశుద్ధాత్ముడికా?

0
242

ముఖ్యముగా అన్ని విధముల ప్రార్ధనలు కేవలం ఆ త్రిఏకదేవునికి మాత్రమే చేయవలసి ఉంది. బైబిల్ మనకి ఏమని బోధిస్తుంది అంటే ప్రార్ధన అనేది త్రిత్వములోని ఏ వ్యక్తికైనా లేక ముగ్గురికి ఒక్కసారే అయినా కలిపి అయినా చేయవచ్చు. ఎందుకంటే త్రిత్వములోని వ్యక్తులు వేరుగా కాక ఏకమై, ఒక్క ధైవముగాను ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగాను ఉనికిలో ఉన్నారు. తండ్రికి కలిగినవన్నీ కుమారుడివి, కుమారిడికి కలిగినవన్నీ పరిశుద్ధాత్మ దేవునివి, పరిశుద్ధాత్మ దేవునికి కలిగినవన్నీ తండ్రి అయిన దేవునివి.  ఈ విధముగా ముగ్గురూ ఏకమై ఒక్క దైవముగాను ఉన్నారు.

కీర్తనలు 5: 2 (“నా రాజా నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము.నిన్నే ప్రార్థించుచున్నాను”) ఈ వచనమును ఒకసారి  చూసినట్లయితే దావీదు తండ్రి అయిన దేవునికి ప్రార్ధన చేయుట గమనించవచ్చు.

తండ్రి అయిన దేవునిని ప్రార్ధించినట్లు ప్రభువైన ఏసుక్రీస్తుని ప్రార్ధించవచ్చును. ఎందుకనగా వారు ఏకమై ఉన్నటువంటి వ్యక్తులు. త్రిత్వములోని ఒక వ్యక్తికి ప్రార్ధించినట్లయితే ముగ్గురినీ ప్రార్ధించినట్లే.

అపొ. కార్యములు 7: 59 (“ప్రభువును గూర్చి మొరపెట్టుచు యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్తెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి”)

పై వచనం ప్రకారం స్తెఫెనును రాళ్ళతో కొట్టి చంపినపుడు అతను యేసయ్యకు ప్రార్ధించుట మనం గమనించవచ్చు.

ఎఫెసీయులకు 5: 20:
“మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట సమస్తమునుగూర్చి తండ్రియైన దేవునికి ఎల్లప్పుడును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడియుండుడి”)

పై వచనం ప్రకారం మనం యేసుక్రీస్తు నామమున ప్రార్ధించవచ్చును. అపోస్తులుడైన పౌల్ గారు దేవుని విస్వాసులైనటువంటి ఎఫిసీయులను ప్రతి విషయములోను ప్రభువైన యేసుక్రీస్తు నామములో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని హెచ్చరిస్తున్నాడు.

యోహాను సువార్త 15: 16:
“మీరు నన్ను ఏర్పరచుకొనలేదు; మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకనుగ్రహించునట్లు మీరు వెళ్లి ఫలించుటకును, మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని”

యోహాను సువార్త 16: 23:
“ఆ దినమున మీరు దేని గూర్చియు నన్ను అడుగరు; మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను”)

పై రెండు వచనముల ప్రకారం మన యేసయ్య తన పేరిట ఏమి అడుగుదురో అది అనుగ్రహింపబడును అని హామీ ఇస్తున్నాడు.

అలాగే

రోమీయులకు 8: 26:
“అటువలె ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఏలాగు ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యముకాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపనము చేయుచున్నాడు”).

యూదా 1: 20:
“ప్రియులారా, మీరు విశ్వసించు అతిపరిశుద్దమైనదానిమీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థనచేయుచు”.

పై రెండు వచనముల ప్రకారం పరిశుద్ధాత్మ శక్తితో, పరిశుద్ధాత్మలో ప్రార్ధన చేయమని బైబిల్ మనకి భోదిస్తుంది.

ప్రార్ధన ఎలా చేయాలి అన్న ప్రశ్నకు చక్కని నిర్వచనం ఈ విధంగా చెప్పవచ్చు “ప్రార్ధన అనేది పరిశుద్ధాత్మ దేవుని శక్తి చేత తండ్రి అయిన దేవునికి, కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా చేయాలి”

ప్రార్ధన యందు త్రిఏకదేవునిలోని ముగ్గురిలో ఎవరికి ప్రార్ధన చేయాలి అన్న ఆలోచన తప్పు ఎందుకనగా ఈ ముగ్గురూ వేరుగా లేరు “వీరు ప్రతి విషయములోను ఏకమై వున్నారు” వీరిలో ఎవరిని ఏ రకంగా ప్రార్ధించినను అందరిని సమానముగా ప్రార్ధించినట్లే.

కొన్ని క్రైస్తవేతర మతాలు తమ యొక్క అనుచరులని దేవుడు కాని వారికి అనగా సమాధులకు, చనిపోయిన పరిశుద్ధులకు, ఆత్మలకు ప్రార్ధన చేయవచ్చని ప్రోత్సహిస్తూ ఉంటారు. రోమన్ కాథలిక్ లు కన్య అయిన మరియకు, అనేక పరిశుద్ధులకు ప్రార్ధన చేయవచ్చని బోధిస్తారు కాని ఈ రకమైన బోధనలు దేవుని సంబంధమైనవి కావు. దేవుని ఉగ్రతకు లోనైనవి. ఇలా ఇతరులకు ప్రార్ధన చేయటం ఏ విధంగా తప్పు అని మనం ఆలోచించినట్లైతే ముందుగా మనం ప్రార్ధన యొక్క అర్ధం తెలుసుకోవలెను.

ప్రార్ధనలో అనేకమైన అంశములు కలవు. ఉదాహరణకు ఇందులో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్పుట, స్తోత్రము చేయుట అను అంశములు కలవు. వీటిని ఒకసారి గమనించినట్లైతే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అంటే దేవుని యొక్క కృపను, ప్రేమను, కనికరమును ఆరాధిస్తున్నట్లే. అదేవిధముగా దేవునికి స్తోత్రం చెబుతున్నాం అంటే ఆయన యొక్క గుణాలను, క్రియలును ఆరాధిస్తున్నట్లే.

దేవునికి తప్ప మరెవరికైనను ప్రార్ధన చేసిన యెడల వానిని దేవుడు క్షమించడు ఎందుకనగా దేవుడు తన మహిమను వేరొకరితో పంచుకొనడు. దేవునికి తప్ప ఎవరికైనను ప్రార్ధన చేసిన యెడల మనం విగ్రహారాధన చేసినట్లే.

యెషయా 42: 8:
“యెహోవాను నేనే; ఇదే నా నామము మరి ఎవనికిని నా మహిమను నేనిచ్చువాడను కాను నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెంద నియ్యను”.

ప్రార్ధనలో మిగిలిన అంశములు అయినటువంటి “పశ్చాతాప్పపడుట, పాపం ఒప్పుకొనుట, అభ్యర్ధించుట అనునవి కూడా దేవునిని ఆరాధించుటయే. మనం దేవుని ప్రేమను బట్టి, ఆయన క్షమించే గుణమును బట్టి పశ్చాతాప్పపడుతూ వుంటాం.

మన పాపములను క్షమించే నిమ్మితం మనం ఆయనను ఆరాధిస్తున్నాము.

1 యోహాను 1: 9:
“మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును”.

దేవుని వద్దకు మన యొక్క అభ్యర్ధనలతో, అవసరాలతో వెళుతూ వుంటాం ఎందుకంటే దేవుడు మన అవసరాలని తీరుస్తాడని, మనల్ని ప్రేమిస్తాడని,మన మాటలను వింటాడని. ఈ విధంగా మనం మన అభ్యర్ధనలతో ఆయనను ఆరాధిస్తూ వుంటాం.

చివరిగా వీటన్నిటి బట్టి ప్రార్ధన అనగా దేవునిని ఆరాధించుట కాబట్టి ఆరాధన కేవలం ఆ త్రిఏక దేవుడైన తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడుకే గాని మరి ఎవరికిని కాదు.