యేసు ప్రభువుకు దేవుడు ఉన్నాడా?

0
557

ఈ ప్రశ్నకి సమాధానం కనుగొనేటప్పుడు ముందుగా నిజ దేవుని లక్షణాలను గూర్చి తెలుసుకొవాలి. బైబిల్ నందలి దేవుడు త్రిత్వమై ఉన్నాడు ఆయన ఒంటరి వాడు కాడు . అనగా ఆయన ఒక్కడే దేవుడిగా ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగా ఉనికిలో ఉన్నాడు. ఈ ముగ్గురూ తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు ఏకమై ఉంటేనే ఏ క్రియ అయినా సంపూర్ణమగును. మొదటిగా మన ప్రభువైన యేసయ్య ద్విస్వభావం గలవాడని గుర్తుంచుకోవాలి అంటే ఆయన సంపూర్ణముగా దేవుడును, సంపూర్ణముగా మానవుడును అయి ఉన్నాడు. (100% GOD & 100% MAN)

యేసయ్య మానవుడిగా పుట్టినందున ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను.

గలతీయులు 4: 5:
“మనము దత్తపుత్రులము కావలెనని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్నవారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడినవాడాయను”.

హీబ్రుయులకు 2: 9:
“దేవుని కృపవలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించునట్లు, దూతలకంటె కొంచెము తక్కువవాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున, మహిమాప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము”.

పై వచనం ప్రకారం యేసయ్య “దేవదూతల కంటే కొంచెము తక్కువవాడుగా చేయబడెను. ఎవరైనా సరే ధర్మశాస్త్రమునకు లోబడినవాడై దేవదూతల కంటే తక్కువవాడుగా చేయబడితె వారు ధర్మశాస్త్రమును అనుసరించుచు దేవునికి ప్రార్దించవలసి ఉన్నది. మన యేసయ్య విషయములో కూడా అదే జరిగింది.

దేవునిచే రచించబడిన “బైబిలు” ను జాగ్రత్తగా పరిశీలించినట్లైతే దేవుని యొక్క లక్షణములు మనకి వెల్లడి పరచబడతాయి.

* దేవుడు త్రిత్వమై ఉన్నాడు – తండ్రి, కుమారుడు, పరిశుద్దాత్ముడు
* వీరు ఒక్క దేవుడిగాను ముగ్గురు వేరు వేరు వ్యక్తులుగాను ఉన్నారు.
* వీరు ముగ్గురూ ముగ్గురు దేవుళ్ళు కారు గాని ఒకే ఒక్క దేవుడిగాను ముగ్గురు వ్యక్తులుగాను ఉనికిలో ఉన్నారు. ఈ ప్రత్యేక లక్షణం దేవునిచే స్ప్రుష్టించబడిన మానవ ఊహకు అందనది. మానవ జ్ఞానము పరిమితమైనది ఈ పరిమిత జ్ఞానంతో అనంతుడు,అద్వితీయుడు, సమస్తం ఎరిగినటువంటి దేవుని యొక్క జ్ఞానమును అంచనా వెయలెము.

మనం దేవుని వాక్యాన్ని అర్ధం చేసుకుంటే ఈ ప్రశ్నకు సమాధానం సులభముగా కనుగొనవచ్చు.

యేసయ్య త్రిత్వములోని రెండవ వ్యక్తి.

కొలస్సియులకు 2: 9:
“ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది”.

ఫిలిప్పియులు 2: 7-8:
“మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగాకనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందు నంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను”.

యేసు ప్రభువు వారు ఇంకనూ ప్రస్తుతం కూడాను నరుడిగానే ఉండెను.

1 తిమోతి 2: 5:
“దేవుడొక్కడే, దేవునికిని నరులకును మధ్య వర్తియు ఒక్కడే; ఆయన క్రీస్తుయేసను నరుడు”

మరియు ఇక శాశ్వతముగా ఆయన నరుని వలే ఉండును.

1 కొరింథీయులకు 15: 28:
“మరియు సమస్తమును ఆయనకు లోపరచబడి నప్పుడు దేవుడు సర్వములో సర్వమగు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరచిన దేవునికి తానే లోబడును”.

హెబ్రీయులకు 6:20:
నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధానయాజకుడైన యేసు అందులోనికి మనకంటె ముందుగా మన పక్షమున ప్రవేశించెను”.

ఇంకా ఒక అద్భుతమైన విషయం చెప్పాలంటే మన తండ్రి అయిన దేవుడే స్వయంగా, మన యేసయ్యను “దేవా” అని పిలుస్తున్నారు.

హెబ్రీయులకు 1:8:
“గాని తన కుమారునిగూర్చియైతే దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునది;నీ రాజదండము న్యాయార్థమయినది”.

ఇలా వీరు ముగ్గురూ ఏకమై ఒక దైవముగా వున్నారు కనుక ఒకరికొకరు దేవా అని పిలుచుకొనుటలో ఆశ్చర్యం ఏమి లేదు. కాబట్టి తండ్రి చిత్తనుసారం దేవుడే మానవుడిగా ఈ బువి మీదకి దిగి వచ్చినటువంటి యేసయ్యకు తన తండ్రి అయిన దేవునిని దేవుడని పిలువవలసి ఉంది ఆయనకు ప్రార్ధన చేయవలసి ఉంది. అంటే ఆయన దేవుడు కాడని అర్ధం కాదు ఆయన ఎల్లప్పుడూ సంపూర్ణముగా దేవుడు మరియు సంపూర్ణముగా మానవుడు.

దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.