ఇస్లాంలో రక్షణ / నిజాత్

0
90

ఈ మధ్యకాలం లో కొన్ని ఇస్లామిక్ సాహిత్యాలను పరిశీలించే సమయంలో మౌలానా మహబూబ్ ఇలాహి గారు ప్రసంగించిన ఒక ప్రసంగం వినటం జరిగింది. ఆ ప్రసంగం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే పాప క్షమాపణ నిమిత్తం, రక్షణ నిశ్చయత నిమిత్తం అనగా ఉర్దూలో నిజాత్ నిమిత్తం అల్లాహును వేడుకొనవలెను అని. ప్రసంగం ఎలా వున్నా అసలు విషయమైన రక్షణ నిశ్చయతను జాగ్రతగా పరిశీలించాలని ఈ వ్యాసం పొందు పరచడం జరిగింది.

ఇస్లాం దేవుడైన అల్లాః అసలు క్షమించే దేవుడేనా అని చూస్తే కురాన్ లో చాలా మార్లు “అల్లాః అల్ – రహ్మాన్, అత్యంత కరుణామయుడు”,  “అల్ – గఫూర్ – అత్యంత క్షమా హృదయము గలవాడు”, “అల్-అఫువ్వ , విడిచిపెట్టువాడు / విడుదల చేయువాడు”, “అల్ – తవ్వాబ్ , పశ్చాత్తాపమును స్వీకరించువాడు” అని పిలువబడడం గమనించవచ్చు. మరి ఇంత కరుణామయుడైన అల్లాః యొక్క మతములో తప్పక పాప క్షమాపణ, పాపము నుండి విడుదల మరియు రక్షణ నిశ్చయత ఉండాలి కదా? ఆ విషయాన్నే పరిశీలిద్దాం. ఇస్లాం మత స్థాపకుడైన మొహమ్మద్ గారు సైతం తను పరలోకమునకు చేరతాడో లేదో తెలియనంత అయోమయ స్థితి లో ఉన్నట్టు కురాన్ మరియు హద్దీతులలో స్పష్టంగా చూడవచ్చు(Sahih al-Bukhari, Volume 5, Book 58, నెంబర్ 266 ).

ఖురాను . 46: 8-9:
లేదా ఇలా అంటారు: “ఇతనే (ము’హమ్మదే) దీనిని కల్పించాడు.” వారితో ఇలా అను: “ఒకవేళ నేను దీనిని కల్పించి ఉండినట్లయితే, మీరు నన్ను అల్లాహ్‌ (శిక్ష) నుండి ఏ మాత్రం కాపాడలేరు. మీరు కల్పించే మాటలు ఆయనకు బాగా తెలుసు. నాకూ మీకూ మధ్య ఆయన (అల్లాహ్‌) సాక్ష్యమే చాలు! మరియు ఆయన క్షమాశీలుడు, అపార కరుణాప్రదాత. “(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు. నేను అనుసరించేది, నాపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వ’హీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే.”

దీనిని గురించిన ప్రస్తావన ఈ వ్యాసములో ముందు తప్పక చూడగలరు. ఇస్లాం స్థాపకుడైన మొహమ్మద్ గారికి శాంతి దొరకాలని అల్లాః మరియు ఆయన దూతలు సయితం ప్రార్తిస్తున్నట్టు కురాన్ లోని సురా . 33:56 చెబుతుంది.(అరబిక్ భాష లోని “సల్లల్లాహు ఆలైహి వసల్లం” అనే మాటకు అర్థం అదే).

ఖురాను 33: 56:
నిశ్చయంగా అల్లాహ్‌ మరియు ఆయన దూతలు ప్రవక్తపై దురూద్‌లు పంపుతూ ఉంటారు. ఓ విశ్వాసులారా! మీరు కూడా అతనిపై దురూద్‌లు మరియు మీ హృదయ పూర్వక సలాంలు పంపుతూ ఉండండి.

“అల్లా హుమ్మ సల్లిఅల సయ్యిదిన ముహమ్మద్ వ -సల్లిం” అనే ప్రార్థనకు అర్థం ఓహ్ అల్లాః మా యజమాని అయిన మొహమ్మద్ ను ఆశీర్వదించి ఆయనకు శాంతి అనుగ్రహించు అని అర్థం. మరి శాంతి అనుగ్రహించమని అడిగే అవసరం మొహమ్మద్ గారికి ఎందుకో నిదానంగా గమనించే ప్రయత్నం చేద్దాం.

విశ్వాసము మరియు మంచి కార్యములు:
ఇస్లాంలో రక్షణ విశ్వాసము ద్వారా మరియు మంచి కార్యములు చేయుట ద్వారా పొందవచ్చు అని కురాన్ చెబుతోంది.

ఖురాను 2: 25:
“మరియు విశ్వసించి, సత్కార్యాలు చేసేవారి కొరకు నిశ్చయంగా క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలు ఉంటాయనే శుభ వార్తను వినిపించు. ప్రతిసారి వారికి తినటానికి ఫలాలు ఒసంగబడినపుడల్లా, వారు: “ఇవి ఇంతకు ముందు మాకు ఇవ్వబడినవే!” అని అంటారు. ఎందుకంటే వారికి ఇవ్వబడేవి వాటీ పోలికగలవే. అక్కడ వారికి నిర్మల సహవాసులు (అ’జ్వాజ్) ఉంటారు. మరియు వారందులో శాశ్వతంగా ఉంటారు.”

ఖురాను 2: 81-82
“వాస్తవానికి, ఎవరు పాపం అర్జించారో మరియు తమ పాపం తమను చుట్టుముట్టి ఉన్నదో, అలాంటి వారు నరకవాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.
మరియు ఎవరైతే విశ్వసించి సత్కార్యాలు చేస్తారో, అలాంటి వారు స్వర్గ వాసులు. అందులో వారు శాశ్వతంగా ఉంటారు.”

కానీ కురాన్ లోని మరి కొన్ని సూరాలు మాత్రం ఇందుకు భిన్నంగా చెప్పడం గమనించదగినది. ఉదాహరణకు సురా 24 : 21 ప్రకారము కేవలం అల్లాః అనుగ్రహము/కృప వలననే రక్షణ లేక స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఇస్లాం సాహిత్యమైన సాహి అల్ బుఖారిలో కూడా మొహమ్మద్ ఇదే విధంగా బోధించినట్టు నమోదు చేయబడి ఉన్నది.

ఖురాను 24: 21 :
“ఓ విశ్వాసులారా! షై’తాన్‌ అడుగు జాడలలో నడవకండి. మరియు ఎవడు షై’తాన్‌ అడుగుజాడలలో నడుస్తాడో! నిశ్చయంగా, షై’తాన్‌ అతనిని అశ్లీలమైన మరియు అసభ్యకరమైన పనులు చేయటానికి ప్రోత్సహిస్తాడు మరియు మీ యెడల అల్లాహ్‌ అనుగ్రహం మరియు ఆయన కరుణయే లేకుంటే, మీలో ఒక్కడు కూడా నీతిమంతునిగా ఉండలేడు. కాని అల్లాహ్‌ తాను కోరిన వానిని నీతిమంతునిగా చేస్తాడు. మరియు అల్లాహ్‌ సర్వం వినేవాడు సర్వజ్ఞుడు.

అబూ హురైర యొక్క కథనము: అల్లాః ప్రవక్త చెప్పగా వింటిని “ఒక మనిషి యొక్క మంచి కార్యములు అతనిని స్వర్గంలో ప్రవేశింపజేయలేవు, అప్పుడు ప్రవక్త యొక్క అనుచరులు “నీవుకూడా ప్రవేశించాలేవా? ఓహ్ అల్లాః ప్రవక్తా!” అని అడుగగా ” అవును నేను సైతం అల్లాః కృప నాపై అనుగ్రహించని యెడల స్వర్గములో ప్రవేశింపలేను” అని చెప్పెను.( సాహి అల్ బుఖారి వాల్యూం 7 : గ్రంధం 70 సంఖ్య 577 ). ఇదే కథనం అయిషా కూడా చెప్పగా బుఖారి నమోదు చేసినట్టు వాల్యూం 8 గ్రంధం 76 సంఖ్య 474 లోకూడా చూడవచ్చు.

సమస్య!!

ఇది ఇలా ఉండగా అక్రమ సంబంధముతో రతి జరిపిన వారు, దొంగలు సైతం అల్లాః దేవుడని మొహమ్మద్ ప్రవక్త అని నమ్ముతే వారికి క్షమాపణ, మరణ సెయ్య లో సైతం దొరుకుతుందని ఇదే సాహి అల్ బుఖారి హద్దీతులో నమోదుచేయబడి ఉంది(సాహి అల్ -బుఖారి , వాల్యూం 9, గ్రంధం 93, సంఖ్య 579).

కానీ కురాన్ లోని సురా 4 : 17 -18 వరకు చదివితే అల్లాః ఇలాంటి క్షమాపణలు ఇవ్వడని తెలుస్తుంది.

ఖురాను 4: 17-18:
నిశ్చయంగా పశ్చాత్తాపాన్ని అంగీకరించటం అల్లాహు కే చెందినది. ఎవరైతే అజ్ఞానం వల్ల పాపంచేసి, వెనువెంటనే పశ్చాత్తాపపడతారో! అలాంటి వారి పశ్చాత్తాపాన్ని అల్లాహ్ స్వీకరిస్తాడు. మరియు అల్లాహ్ సర్వజ్ఞుడు, మహా వివేచనాపరుడు. మరియు వారిలో ఒకడు, మరణం ఆసన్నమయ్యే వరకూ పాపకార్యాలు చేస్తూ వుండి: ”ఇప్పుడు నేను పశ్చాత్తాప పడుతున్నాను!” అని అంటే అలాంటి వారి పశ్చాత్తాపం మరియు మరణించేవరకు సత్యతిరస్కారులుగా ఉన్నవారి (పశ్చాత్తాపం) స్వీకరించబడవు. అలాంటి వారి కొరకు మేము బాధాకరమైన శిక్షను సిధ్ధపరచి ఉంచాము.

పై వాఖ్యం ఒక వేళ వారికి అర్థం అయి ఉంటె, ఇందులో నమ్మవలసిన సిద్ధాంతం ఏమిటో ముస్లిం పండితులే వివరించాలి. కేవలం విశ్వాసముతో మంచి కార్యములు చేస్తే రక్షణ దొరుకుతుందా? లేక అల్లాః యొక్క కరుణ, అనుగ్రహం వలన మాత్రమే రక్షణ దొరుతుందా?? అల్లాః మరణ సెయ్య పై సైతం క్షమాపణలు స్వీకరిస్తాడా? లేక అల్లాః మరణ సెయ్య పై క్షమాపణలు స్వీకరించడా? మంచిక్రియల వలన స్వర్గ ప్రాప్తి కలుగుతుందని అనుకుంటే – అల్లాః కృప యొక్క పని మరియు ఆ కృప వలన మాత్రమే రక్షణ అని చెప్పే కురాన్ తప్పు కదా? అలాగే ఎలాంటి జీవితం జీవించినా ఆఖరున అల్లాః పై విశ్వసిస్తే ఆయన క్షమించి రక్షిస్తాడు అంటే మంచి కార్యములు అనవసరం కదా? ఇవి రెండూ కాదు కేవలం అల్లాః అనుగ్రహమే కారణం మంచి పనులు చేసినా చేయక పోయినా ఫలితం ఉండదు అని చెబితే, నిశ్చయత ఉండదు కదా? ఎటు చూసినా కురాన్ బాధలో సమస్యే కానీ సమాధానం కనిపించటం లేదు.

అంతా గజిబిజిగా ఉంది కదా!!

వీటన్నిటిలో దేనిని నమ్మాలో దేనిని నమ్మకూదదో కనీసం మొహమ్మద్ గారి కన్నా తెలుసేమో అని చూస్తే ఆయన సైతం తన రక్షణ నిమిత్తమై అనిశ్చయత కలిగి ఉన్నట్టు చూస్తాం.

ఖురాను 46: 9:
(ఓ ము’హమ్మద్‌!) వారితో ఇలా అను: “నేను మొట్టమొదటి ప్రవక్తనేమీ కాను. నాకూ మరియు మీకూ ఏమి కానున్నదో నాకు తెలియదు. నేను అనుసరించేది, నాపై అవత రింపజేయబడిన దివ్యజ్ఞానం (వ’హీ) మాత్రమే. మరియు నేను కేవలం స్పష్టంగా హెచ్చరిక చేసేవాడను మాత్రమే.”

అబూ హురైరా కథనం:ఈ సురాను అల్లాః ప్రకటింప చేసిన తరువాత అల్లాః ప్రవక్త లేచి నిలబడి ఈ విధముగా అనెను ” ఓ కురైశ్ ప్రజలారా మిమ్మును మీరు రక్షించు కొనుడు, ఎందుకనగా నేను మిమ్మును అల్లాః యొక్క శిక్ష/ దండన నుండి రక్షించలేను. ఓ బని అబ్ద్ మనాఫ్ , నేను మిమ్మును అల్లాః యొక్క శిక్ష/ దండన నుండి రక్షించలేను, ఓ సఫియ ( అల్లాః ప్రవక్త యొక్క పిన్నమ్మ/అత్త ) నేను మిమ్మును అల్లాః యొక్క శిక్ష/ దండన నుండి రక్షించలేను.మొహమ్మద్ కుమార్తె అయిన ఓ ఫాతిమా, నన్ను నా సంపదనుండి ఏమైనా అడుగు కానీ నేను నిన్ను అల్లాః యొక్క శిక్ష/ దండన నుండి రక్షించలేను” (సాహి అల్ బుఖారి వాల్యూం 4 గ్రంధం 51 సంఖ్య 16 )

పై సురా మరియు దాని వివరణగా ఇవ్వబడిన హద్దీతును ఆధారం చేసుకొని ఎవ్వరైనా సరే మొహమ్మద్ కు తన అనుచరుల మరియు తన స్వంత రక్షణపై నిశ్చయత ఉన్నదని చెప్పగలరా? ఒక వేళ ఏ ముస్లిం పండితులైనా దీనిని కురాన్ మరియు హద్దీతుల ఆధారముగా నిజాయితీగా వివరించగలరా? ఒక వేళ డొంక తిరుగుడుగా ఏదో వివరణ ఇచ్చినా,ఆ వివరణ కురాన్ మరియు హద్దీసుల ప్రకాశాములోనే ఉండాలి. ఒక సురా (అధ్యాయం) విశ్వాసం వలన అని , ఇంకొ సురా కేవలం అల్లాః కరుణ అని , అలాగే ఒక సురా క్షమాపణ దొరుకుతుందని ఇంకొ సురా క్షమాపణ దొరకదని ఒక దానిని ఒకటి ఖండించుకొనే నేపద్యం లో కురాన్ ను దైవ ప్రేషిత మైన పుస్తకమని నమ్మటానికి చాలా విశ్వాసం కావాలి? మానవాళికి అత్యున్నత మార్గదర్శి మరియు అల్లాః కు అత్యున్నత సన్నిహితుడైన మొహమ్మద్ కే తన రక్షణ పై నిశ్చయత లేనప్పుడు తన అనుచరులకు యే గతి పడుతుందో తెలియనప్పుడు ఆ మతమును అవలంబిచడం కోసము చాలా విశ్వాసము కావాలి?