యేసయ్య ధర్మశాస్త్రం కొట్టివేసాడా? లేక నేరవేర్చాడా?

0
504

మత్తయి 5:17:
ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టి వేయవచ్చితినని తలంచవద్దు; నెరవేర్చుటకే గాని కొట్టి వేయుటకు నేను రాలేదు.

ఈ వచనము ప్రకారం యేసయ్య ధర్మశాస్త్రము నేరవేర్చడానికే గాని, కొట్టివేయడానికి ఈ లోకమునకు రాలేదు అని స్పష్టం అవుతుంది.

ఎఫెసీయులకు 2:14
ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.

పై వచనము ప్రకారము యేసయ్య శరీరమందు ధర్మశాస్త్రము కొట్టివేయబడినది అని మనకి స్పష్టం అవుతుంది.

మరి ఇది ఎలా సాధ్యం ? దేవుని ఊపిరి అయిన బైబిల్ నందు రెండు భావవిరుద్ధమైన అంశములు ఉండవచ్చునా? ఉండకూడదు. మరైతే ఈ సంధర్బమును ఏ విధముగా అర్ధము చేసుకోవాలి?

సరే దేవుని వాఖ్యాన్ని అర్ధము చేసుకునే ప్రయత్నము చేద్దాం.

మత్తయి 5:17 వచనము నందు యేసయ్య పాతనిభందన కట్టడలు, నియమనిభందనలు, పాలనధికారాలు, ప్రవచనములను గూర్చి మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా  యేసయ్య నందు పూర్తిగా నేరవేర్చబడినవి, స్దిరపరచబడినవి. ఉదాహరణకు

 • రక్షకుడు కన్యకు జన్మించుట

యెషయా 7:14:
కాబట్టి ప్రభువు తానే యొక సూచన మీకు చూపును. ఆలకించుడి, కన్యక గర్భవతియై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలను పేరు పెట్టును.

మత్తయి 1:18, 25:
యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను; అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను.

 • యేసయ్య నందు ఆశీర్వదింపబడే అబ్రహాము సంతానము

ఆదికాండము 22:18:
మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెన నెను.

మత్తయి 1:1:
అబ్రాహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి.

 • వాగ్ధానము చేయబడిన ప్రవక్త

  ద్వితియోపదేశకాండము 18:18
  వారి సహోదరులలోనుండి నీవంటి ప్రవక్తను వారికొరకు పుట్టించెదను; అతని నోట నా మాటల నుంచుదును; నేను అతని కాజ్ఞా పించునది యావత్తును అతడు వారితో చెప్పును.

మత్తయి 21:11
జనసమూహముఈయన గలిలయలోని నజరేతువాడగు ప్రవక్తయైన యేసు అని చెప్పిరి

 • వాగ్ధానము చేయబడిన యాజకుడు

  కీర్తనలు 110:4
  మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.

హెబ్రీయులకు 5:5:
అటువలె క్రీస్తుకూడ ప్రధాన యాజకుడగుటకు తన్నుతానే మహిమపరచుకొనలేదు గాని నీవు నా కుమారుడవు, నేను నేడు నిన్ను కనియున్నాను. అని ఆయనతో చెప్పినవాడే ఆయనను మహిమపరచెను.

 • మన పాపముల కొరకు యేసయ్య సిలువ వేయబడుట

  కీర్తనలు 22:1, 17, 18
  నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు? నా యెముకలన్నియు నేను లెక్కింపగలను వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు నా అంగీకొరకు చీట్లు వేయుచున్నారు.

  లూకా 23:33:
  వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమవైపున ఒకనిని ఆ నేరస్థులను ఆయనతో కూడ సిలువవేసిరి.

 • యేసయ్య మృతులలో నుండి లేపబడుట:

కీర్తనలు 16:10:
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు

మత్తయి 28:6, 7:
ఆయన ఇక్కడ లేడు; తాను చెప్పినట్టే ఆయన లేచి యున్నాడు; రండి ప్రభువు పండుకొనిన స్థలము చూచిత్వరగా వెళ్లి, ఆయన మృతులలోనుండి లేచియున్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి; ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్లు చున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు; ఇదిగో మీతో చెప్పితిననెను.

ఇలా ఈ విధముగా యేసయ్య , ధర్మశాస్త్రము మొత్తమును నెరవేర్చాడు. యేసయ్య నందు ధర్మశాస్త్రము సంపూర్ణముగా నేరవేర్చబడినది, ఆయన ధర్మశాస్త్రమును  కొట్టివేయడానికి రాలేదు.

ఇక రెండవ వచనము అయిన ఎఫెసీయులకు 2:14 విషయానికి వద్దాం.

ఎఫెసీయులకు 2:14
ఆయన మన సమాధానమైయుండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలుగల ధర్మశాస్త్ర మును తన శరీరమందు కొట్టివేయుటచేత మధ్యగోడను పడగొట్టి, మన ఉభయులను ఏకముచేసెను.

ఈ వాఖ్యము సమస్త లోకమున నందు గల అన్యజనులను గూర్చి వివరిస్తుంది. ధర్మశాస్త్రము కేవలము యూదులకు మాత్రమే ఇవ్వబడినది. మన దేవుని కృప సమస్త లోకమునకు ఇవ్వబడినది. దేవుడు మోషేకు ఇవ్వబడిన ధర్మశాస్త్రము వలన మనము ఇదివరకు దేవుని వాగ్దానము లేని అన్యజనులుగా, నిరీక్షణ లేని వారిగా , క్రీస్తుకు దూరముగా ఉన్నాము.

ఎఫెసీయులకు 2:11:
కాబట్టి మునుపు శరీరవిషయములో అన్యజనులైయుండి, శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారిచేత సున్నతిలేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులుకాక, పరదేశులును, వాగ్దాన నిబంధనలు లేని పరజనులును, నిరీక్షణలేనివారును, లోకమందు దేవుడులేనివారునైయుండి, క్రీస్తుకు దూరస్థులై యుంటిరని మీరు జ్ఞాపకము చేసికొనుడి.

కాబట్టి యేసయ్య మనకు, దేవునికి మధ్య ఉన్న ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేసి ఇశ్రాయేలు ప్రజలతో సమానముగా  మనలను దేవుని ప్రజలుగా చేసాడు. ఎంత గొప్ప యేసయ్య ప్రేమ.

చివరిగా యేసయ్య దేవుడై , తాను ఇచ్చిన ధర్మశాస్త్రము మొత్తమును పూర్తిగా  నెరవేర్చి, దేవునికి అన్యజనులమైన మనకు మధ్య ఉన్న ధర్మశాస్త్రమును ఆయన శరీరమందు కొట్టివేసి ఇశ్రాయేలు ప్రజలతో సమానముగా  మనలను దేవుని ప్రజలుగా చేసాడు.

ఇప్పుడైతే మనము స్వతంత్రులము, ధర్మశాస్త్రము క్రింద ఉన్నవారము కాదు.

రోమీయులకు 6:14:
మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.