చనిపోయిన తరువాత మనం ఆత్మలుగా ఉంటామా, లేక శరీరములను ధరించుకొంటామా ?

పునరుత్థానము అనేది యేసయ్య, క్రైస్తవులకు చేయబడిన ముఖ్యమైన వాగ్ధానం. అయితే చాలా మంది క్రైస్తవులలో మనం చనిపోయిన తరువాత ఏ విధముగా రూపాంతరము చెందుతాము అన్న విషయములో స్పష్టత లేదు.  కొంతమంది అబద్ద భోదకుల వలన క్రైస్తవులు, ముఖ్యమైన విస్వాసములలో కూడా గందరగోళానికి గురి చేయబడ్డారు. కొందరు వారి శిష్యులకు నేర్పించేది ఏమనగా, చనిపోయిన తరువాత మనం కేవలం ఆత్మలుగా ఉంటాము, ఎటువంటి శరీరమును ధరించుకొనము అని. ఎంత భిన్నమైన బోధ ! బైబిల్ మొత్తం కూడా మనం చనిపోయిన తరువాత మహిమ గల శరీరమును ధరించుకొంటాము అని భోదిస్తుంటే, తొడలు కొడుతూ వాఖ్యాన్ని బోధిస్తూ తనను తాను క్రీస్తుతో సమానముగా చేసుకుని గర్వించే వారి బోధను అంగీకరించగలమా? సరే ఈయన గారి వాదనను ప్రక్కన పెట్టి దేవుని వాఖ్యమును అర్ధము చేసుకునే ప్రయత్నము చేద్దాం.

బైబిల్ గ్రంధము మనకు చాలా స్పష్టముగా వివరిస్తుంది చనిపోయిన తరువాత మనం మహిమ గల శరీరాలను ధరించుకొంటాము అని. ఉదాహరణకు

ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరము కూడ ఉన్నది.

1కోరింథీయులకు 15:44

మరొక వాఖ్యభాగమును పరిశీలించిన యెడల మన యేసయ్య, మృతులలో నుండి మొట్టమొదటి సారిగా మహిమ గల శరీరముతో లేపబడినవాడు అని స్పష్టం అవుతుంది.

సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు; ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము, ఆయన ఆదియైయుండి మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడాయెను.

కొలస్సీయులకు 1:18

మృతుల పునరుత్థానమును ఆలాగే. శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును;ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును; బలహీనమైనదిగా విత్తబడి, బలమైనదిగా లేపబడును;

1 కోరింథీయులకు 15: 42, 43

కనుక యేసయ్య ఏ విధముగా చనిపోయి, మహిమ గల శరీరముతో తిరిగి లేపబడ్డాడో అదే విధముగా మనము కూడా చనిపోయి మహిమ గల శరీరముతో తిరిగి  పైకి లేపబడుదుము. ఏలయనగా యేసయ్య మృతులలోనుండి లేచుటలో ఆదిసంభూతుడు (కొలస్సీయులకు 1:18) . ఆయన మనందరికీ సాదృశ్యం అయి ఉన్నాడు.

ఆయన ఎలాంటి మహిమ గల ధరించాడు అని బైబిల్ గ్రంధమును మనం పరిశీలించినట్లయితే

ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడ ఉండెను. తలుపులు మూయబడియుండగా యేసు వచ్చి మధ్యను నిలిచిమీకు సమాధానము కలుగును గాక అనెను.తరువాత తోమాను చూచినీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము; నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి, అవిశ్వాసివి కాక విశ్వాసివై యుండుమనెను.

యోహాను 20:26, 27
  • తోమా యేసయ్యను గుర్తు పట్టగలిగినట్లు , మనము కూడా ఇతరులచే గుర్తుపట్టగలం.
  • తలుపులు మూయబడి వున్నా కూడా యేసయ్య గదిలోనికి ఏ విధముగా రాగలిగాడో , అదే విధముగా మనము కూడా ప్రవేశించగలం.
  • యేసయ్యకు శిలువ మరణము వలన కలిగిన గురుతులు వలె, మనము కూడా భౌతికపరమైన గురుతులు కలిగి ఉండగలము.

చివరిగా మనం చనిపోయిన తరువాత ఆత్మలుగా ఉండము అని గుర్తుపెట్టుకోవాలి. శరీరములను ధరించుకొంటాము అనగా ఈ లోక సంభంధమైన శరీరము కాదు, మహిమ గల  అక్షయమైన శరీరము ధరించుకొంటాము అని రూడిగా మన హృదయములో  బద్రపరుచుకోవాలి.

ప్రకృతిసంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మసంబంధ శరీరముగా లేపబడును. ప్రకృతిసంబంధమైన శరీరమున్నది గనుక ఆత్మసంబంధమైన శరీరముకూడ ఉన్నది.

1కోరింథీయులకు 15:44

Leave a Reply