దేవునిని మనం శనివారం కాక ఆదివారం ఎందుకు ఆరాధిస్తున్నాము?

పాత నిభందనలో దేవుడు మనకు ఈ విధముగా ఆజ్ఞ ఇచ్చాడు.

విశ్రాంతిదినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము.ఆరు దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను.ఏడవ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతిదినము. దానిలో నీవైనను నీ కుమారుడైనను నీ కుమార్తెయైనను నీ దాసుడైనను నీ దాసియైనను నీ పశువైనను నీ యిండ్లలో నున్న పరదేశి యైనను ఏపనియు చేయకూడదు

నిర్గామకాండము 20: 8-10

యూదుల సంప్రదాయం ప్రకారం విశ్రాంతి దినము నాడు అనగా శనివారం నాడు అందరూ యేకమై దేవునిని ఆరాధిస్తూ ఉంటారు. మత్తయి సువార్త 12: 9 మరియు యోహాను సువార్త 18: 20 ప్రకారం యేసయ్య కూడా యూదుల ప్రార్ధనా మందిరములో శనివారము నాడు భోధించాడు. కనుక యూదుల ధర్మశాస్త్రం ప్రకారం యేసు ప్రభువు వారు గాని, యూదులు గాని, అపోస్తులు గాని అందరునూ శనివారము నాడు దేవునిని ఆరాధిస్తే, మరి మనం ఎందుకు శనివారం కాక ఆదివారము నాడు దేవునిని ఆరాధిస్తున్నాము? ఎందుకో ఇప్పుడు చూద్దాము.

మొదటిగా దేవుడు యూదులకు ఇచ్చిన పది ఆజ్ఞలలో 9 ఆజ్ఞలు పునః స్థాపించబడినవి, అవేమనగా మార్కు సువార్త 12: 30 లోని “నీవు నీ పూర్ణహృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణవివేకముతోను, నీ పూర్ణబలముతోను, నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలె ననునది ప్రధానమైన ఆజ్ఞ, మరియు మత్తయి సువార్త 19: 18 లోని అయిదు ఆజ్ఞలైన నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, తలిదండ్రులను సన్మానింపుము. ఇంకా రోమియులకు 13: 9 లో గల ఆశింపవద్దు, మరి ఏ ఆజ్ఞయైన ఉన్న యెడల అదియు నిన్నువలె నీ పొరుగువాని ప్రేమింపవలెనను వాక్యములో సంక్షేపముగా ఇమిడియున్నవి. కనుక మనం పొరుగు వానిని ప్రేమించిన యెడల ఒక్క విశ్రాంతి దినము మినహా ధర్మశాస్త్రం అంతయు నెరవేర్చినట్లే. ఈ ఒక్క విశ్రాంతి దినము ఆచరించుట అనే ఆజ్ఞ మాత్రం కొత్తనిభందనలో ఎక్కడా పునః స్థాపించబడలేదు. ఇంకా యేసయ్య తాను ధర్మ శాస్త్రమునకును ప్రభువై ఉన్నాను అని హెచ్చరిస్తున్నాడు (మత్తయి సువార్త 12: 8).

సమస్తమును స్ప్రుజించిన తరువాత దేవుడు ఏడవ దినమున విశ్రమించెను

దేవుడు తాను చేసిన తనపని యేడవదినములోగా సంపూర్తిచేసి, తాను చేసిన తన పని యంతటినుండి యేడవ దినమున విశ్రమించెను

ఆదికాండము 2:2

అనంతుడు, అద్వితీయుడు అయిన దేవునికి విశ్రాంతి అవసరం లేదు, విశ్రాంతి నొందడు. అయితే మరి దేవుడు ఎందుకు విశ్రాంతి నొందవలసి వచ్చినది, దీనికి కారణం మార్కు సువార్త 2: 27 లో మనకు వివరించబడినది.

విశ్రాంతి దినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు

మార్కు సువార్త 2: 27

దీని అర్ధం దేవుడు విశ్రాంతి దినములను నియమించింది మనుష్యులకే గాని దేవునికి కాదు. ఈ విశ్రాంతి దినమున మనుష్యులకు దేవుని గురించి ఆలోచించుటకు, ఆరాధించుటకు అవకాశంవుంటుంది అని దేవుడు దీనిని నియమించాడు.

పాత నిభందన యొక్క ధర్మశాస్త్రం ప్రకారం దేవుని యొక్క ఇష్టాన్ని నెరవేర్చుటకు విశ్రాంతి దినమును ఆచరించవలసి వుంది. ధర్మశాస్త్రం ప్రకారం విశ్రాంతి దినమును ఆచరించని యెడల పాపంలో పడవలసి వస్తుంది, శిక్షించబడవలసి వస్తుంది (యెహేజ్కేలు 18: 4, రోమీయులకు 6: 23, సంఖ్యాకాండం 35: 31)

అయితే మన యేసయ్య ప్రాయశ్చిత్తం మూలంగా మనం ధర్మశాస్త్రం ఆచరించవలసిన అవసరం ఎంతమాత్రము లేదు రోమీయులకు 6:14, 15 ప్రకారం “మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అట్లయినయెడల కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనగువారము కామని పాపము చేయుదమా? అదెన్నటికిని కూడదు”. విశ్రాంతి దినము మన యేసయ్య నందు నెరవేర్చబడినది. ఆయనే మన విశ్రాంతి. మనకి ధర్మశాస్త్రం నెరవేర్చవలసిన అవసరత లేదు. ఇంకా మీరు విశ్రాంతి దినము ఆచరించి, ధర్మశాస్త్రం నెరవేర్చాలి అని అనుకున్నట్లైతే మీరు ధర్మశాస్త్రమునకు లోబడిన వారగుదురు.

కొత్తనిభందనలో కొన్ని ముఖ్యమైన దినములను మార్పిడి చేసారు అనుటకు సాక్ష్యాలు:

యూదులు ఆచరించవలసిన విశ్రాంతి దినమును, మనం ఆచరించ వలసిన అవసరం లేదు అని చెప్పుటకు కొత్తనిభందనలో సాక్ష్యాలు పుష్కలంగా కలవు.

ఒకడు ఒక దినముకంటె మరియొక దినము మంచి దినమని యెంచుచున్నాడు; మరియొకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు; ప్రతివాడు తనమట్టుకు తానే తన మనస్సులో రూఢిపరచు కొనవలెను

రోమీయులకు 14:5, 6

పై వచనములను జాగ్రత్తగా పరిశీలించిన యెడల ఎవరైనా కూడా ఏదో ఒక రోజు వారి మనసులో దేవుని కొరకు నిర్ణయించుకోవలసి వుంది.

కాబట్టి అన్నపానముల విషయములోనైనను, పండుగ అమావాస్య విశ్రాంతిదినము అనువాటి విషయములోనైనను, మీకు తీర్పు తీర్చ నెవనికిని అవకాశమియ్యకుడి. ఇవి రాబోవువాటి ఛాయయేగాని నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది

కొలస్సీయులకు 2:16, 17

గమనించండి ఇక్కడ సమయము యొక్క సంభందిత క్రమమును వివరించారు. పండుగ సంవత్సరమునకు ఒకసారి, అమావాస్య నెలకు ఒకసారి, విశ్రాంతి దినము వారమునకు ఒకసారి వస్తాయి. కాబట్టి ఈ విషయాలలో ఎవరికీ తీర్పు తీర్చుటకు అవకాశం ఇవ్వకూడదు. మన యేసయ్యే మన విశ్రాంతి దినము

ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు, పౌలు మరునాడు వెళ్లనైయుండి, వారితో ప్రసంగించుచు అర్ధరాత్రివరకు విస్తరించి మాటలాడుచుండెను.

అపో.కార్యములు 20:7

వారంలో మొదటి రోజు ఆదివారం. ఈ దినమున మేడ గదిలో అపోస్తులుడైన పౌల్ ప్రజలందరితో విస్తరించి మాటలడుచూ వున్నాడు. ఈ రచనలో మనం స్పష్టంగా ఆదివారము నాడు సంఘములో అందరూ యేకమై కూడుకొని ఉండుట మనం గమనించవచ్చును. ఇంకా గమనించ వలసిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమనగా “రొట్టె విరుచుట , ప్రసంగించుట”. ఇక్కడ మీరు పరిశీలిస్తే లూక యూదుల సంప్రదాయమైన “సూర్యోదయము నుండి సుర్యోదయమును ” ఒక రోజుగా పాటించుటలేదు. ఒక రోజును అర్ధరాత్రి నుండి అర్ధరాత్రిగా పరిగణిoచుచున్నాడు. దీనిని బట్టి లూకా సబ్బాతు దినమును ఆచరించుట లేదు అని చెప్పవచ్చు.

పరిశుద్ధులకొరకైన చందావిషయమైతే నేను గలతీయ సంఘములకు నియమించిన ప్రకారము మీరును చేయుడి. నేను వచ్చినప్పుడు చందా పోగుచేయకుండ ప్రతి ఆది వారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తనయొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను.

1కోరింథీయులకు 16:1, 2

ఈ వచనము చాల ముఖ్యమైనది, ఇక్కడ పౌల్ గారు ప్రతి ఆదివారమున తాను వర్ధిల్లిన కొలది కొంత సొమ్ము నిలువ చేయమని చెబుతున్నాడు. కాబట్టి ఏరోజు సంఘము నందు యేకమై కూడుకొని దేవునిని ఆరాధించాలో మీరే నిర్ణయించుకొండి.

చివరిగా మీకు ఆదివారం దేవునిని ఎందుకు ఆరాధించాలో మీకు అర్ధం అయి వుంటుంది అని నేననుకుంటున్నాను. ఇంకా మీకు ఏ రోజైన దేవునిని ఆరాధించవచ్చు అనుకుంటే ఆరాధించవచ్చును మీకు ఆ స్వాతంత్య్రం (రోమీయులకు 14: 1-12).

మనం మన యేసయ్య నందు స్వతంత్రులం, ధర్మశాస్త్రమునకు లోబడిన వారము కాదు.

మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైనవారు కారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు.

రోమీయులకు 6:14

Leave a Reply