ఈ ప్రశ్న చాలా తేలికగా, చిన్నదిగా అనిపించవచ్చు. ఈ ప్రశ్నకు సమాధానము వ్రాస్తున్న నేను కూడా ఒక పిచ్చి వాడిగా మీకు అనిపించవచ్చు. కానీ ఈ ప్రశ్న తెలుగు క్రైస్తవ్యానికి చాలా ముఖ్యమైనది. ఈ ప్రశ్నకు సమాధానము మీరు కనుగొన్న యెడల ముఖ్యమైన క్రైస్తవ సిద్దంతాలలో మీరు ఎవరు కూడా తప్పిపోరు.
పరిశుద్ధగ్రంధమైన బైబిల్ గ్రంధమును మనము ఒకసారి అరిశీలించినట్లైతే కొన్ని బైబిల్ వచనములు మనకు భావ విరుద్ధముగా మనకు కనపడవచ్చు ఉదాహరణకు కొన్నిటిని మనము గమనించుదాము.
దేవునిని కనులారా చూశారు అనడానికి ఆధారము:
అబ్రాము తొంబదితొమ్మిది యేండ్లవాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
ఆదికాండము 17:1
మరియు మమ్రేదగ్గరనున్న సింధూరవనములో అబ్రాహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చునియున్నప్పుడు యెహోవా అతనికి కనబడెను.
ఆదికాండము 18:1
నేను సర్వశక్తిగల దేవుడను పేరున అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమైతిని కాని, యెహోవా అను నా నామమున నేను వారికి తెలియబడలేదు.
నిర్గమకాండము 6:3
ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాద ములక్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువువంటిదియు ఆకాశ మండలపు తేజమువంటిదియు ఉండెను
నిర్గమకాండము 24:10
వారిద్దరు రాగా ఆయన నా మాటలు వినుడి; మీలో ప్రవక్త యుండిన యెడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలిసి కొనునట్లు కలలో అతనితో మాటలాడుదును. నా సేవకు డైన మోషే అట్టివాడు కాడు. అతడు నా యిల్లంతటిలో నమ్మకమైనవాడు. నేను గూఢభావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును; అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధ ముగా మాటలాడుటకు మీరేల భయపడలేదనెను.
సంఖ్యాకాండము 12:6 – 8
అందుకు స్తెఫను చెప్పినదేమనగా సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురముండక మునుపు మెసొపొతమియలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజనమును విడిచి బయలుదేరి, నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను.
అపో.కార్యములు 7:2 -3
ఇప్పుడు దేవుని ని ఎవరూ చూడలేదు , చూడలేరు అనడానికి ఆధారమును గమనిద్దాము
దేవునిని కనులారా చూడలేదు అనడానికి ఆధారము:
మరియు ఆయన నీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.
నిర్గమకాండము 33:20
ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడె ఆయనను బయలు పరచెను.
యోహాను 1:18
మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.
యోహాను 5:37
దేవుని యొద్ద నుండి వచ్చినవాడు తప్ప మరి యెవడును తండ్రిని చూచి యుండలేదు; ఈయనే తండ్రిని చూచి యున్న వాడు
యోహాను 6:47
సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్.
1తిమోతికి 6:16
పై వచనములను మనము పరిశీలించినప్పుడు బైబిల్ భావవిరుద్ధముగా కనపడుతుంది, ఎందుకంటే కొన్ని సందర్భాల్లో దేవునిని కనులారా చూచారని, కొన్ని సందర్భాల్లో దేవునిని ఎవరూ చూడలేదని చూసి బ్రతకలేదని వ్రాయబడి ఉన్నది. దీనిని క్రొంత మంది ఈ విధముగా వివరించవచ్చు “దేవునిని ప్రత్యక్షముగా చూడలేదు గాని స్వప్నములలో, దర్శనాలలో చూచి ఉంటారు అని” , అయితే నిర్గమకాండము 24:10 ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు దేవునిని స్వప్నములలో, దర్శనాలలో గాక ప్రత్యక్షముగా చూచిరి అని వ్రాయబడి ఉన్నది. మరైతే ఇశ్రాయేలు ప్రజలు ఎవరిని చూచిరి?
ఈ ప్రశ్నకు సమాధానము కనుగొనడం అంటే దేవుని సత్యవాఖ్యమైన బైబిల్ ను మనస్పూర్తిగా అంగీకరించడమే. బైబిల్ చెప్పే సత్యమేదనగా “తండ్రి అయిన దేవుడు ఎప్పుడూ కూడా అనగా పాతనిభందన కాలములో గాని క్రొత్త నిభందన కాలములో గానీ ఎవరికినీ దర్శనము ఇవ్వలేదు ఎవరూ కూడా ఆయనను చూడలేదు”
దీనిని గూర్చియే యేసయ్య యోహాను 6:47 మరియు యోహాను 5:37 లో చాలా స్పష్టముగా వివరించాడు.
మరైతే పాతనిభందన కాలములో గాని క్రొత్త నిభందన కాలములో దేవుని ప్రజలు కన్నులారా చూచినది ఎవరిని ? “అయన మరెవరో కాదు సర్వమానవాలి కొరకు సిలువపై తన ప్రాణమును అర్పించిన యేసయ్య”
యేసయ్య ఈ భూమి మీద మానవునిగా జన్మించక మునుపే తండ్రి అయిన దేవుని చిత్తనుసారము అనేక సార్లు మానవునికి దర్సనమిచ్చాడు.
బేత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబము లలో నీవు స్వల్పగ్రామమైనను నాకొరకు ఇశ్రాయేలీ యులను ఏలబోవువాడు నీలోనుండి వచ్చును; పురాతన కాలము మొదలుకొని శాశ్వతకాలము ఆయన ప్రత్యక్ష మగుచుండెను.
మీకా 5:2
కనుక పాతనిభందన కాలములో గాని క్రొత్త నిభందన కాలములో దేవుడు తన ప్రజలతో మాట్లాడారు అంటే అది కచ్చితంగా ప్రభువైన యేసుక్రీస్తు వారితో అని జ్ఞాపకము ఉంచుకోవాలి. బైబిలు నందు దేవునిని ఎవరునూ, ఎప్పుడునూ చూడలేదు అని వ్రాసినప్పుడు అది తండ్రి అయిన దేవుడిని గూర్చి అని, దేవుని చూచిరి అని వ్రాసినప్పుడు అది యేసయ్యను గూర్చి అని జ్ఞాపకము చేసుకోవలెను.
మరైతే ఇప్పటి పరిస్ధితి ఏమిటి? దేవుడు ఇప్పుడు కూడా మనకు దర్శనము ఇస్తాడా?
అవును, అయన మారని దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు. అయన ఇప్పుడు కూడా మనకు దర్శనము ఇస్తూనే ఉంటాడు. అయితే ఈ దర్శనాల విషయములో క్రైస్తవులమైన మనము చాల జాగ్రత్త వహించాలి. దేవుని ప్రత్యక్షతలు రెండు రకాలు. ఒకటి స్వప్నములు, రెండు దర్శనములు.
- స్వప్నము లో దేవుని ప్రత్యక్షత అనగా నిద్రించే సమయములో అయన మనకు కనపడడం
- దర్శనములో దేవుని ప్రత్యక్షత అనగా మనము మెలుకువ తో ఉన్నప్పుడు అయన మనకు కనపడడం.
కనుక ఒక ఆత్మ తప్పిపోతుంది అని దేవుడు భావించినప్పుడు కచ్చితంగా అయన తన ప్రత్యక్షను కనబరుచుకుంటాడు. అయన ప్రత్యక్షతలు ఒక వ్యక్తి ద్వారా అయివుండవచ్చు, దేవదూత ద్వారా అయివుండవచ్చు, సంఘము ద్వారా అయివుండవచ్చు, స్వప్నము ద్వారా అయివుండవచ్చు, దర్శనము ద్వారా అయివుండవచ్చు.
మరైతే అయన ప్రత్యక్షతో అవునో, కాదో అని ఎలా నిర్ధారించవచ్చు? ఇది చాలా ప్రాముఖ్యకరమైన విషయము. ఎవరో చెప్పారని, దర్శనము కలిగిందని సంఘము చెప్పిందని, దేవదూత ద్వారా కలిగింది అని ప్రతి వాటిని మనము గుడ్డిగా నమ్మకూడదు. దీనిని గూర్చి బైబిల్లో చాలా స్పష్టముగా ఈ విధముగా వ్రాయబడి ఉంది.
పూర్వకాలమందు నానాసమయములలోను నానా విధములుగాను ప్రవక్తలద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాటలాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను.
హెబ్రీయులకు 1:1,2
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవునియొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
యోహాను 1:1
చూచారా? బైబిల్ నందు ఎంత స్పష్టముగా దేవుని మర్మము వ్రాయబడి ఉందొ. కనుక ప్రతి ప్రత్యక్షత ను నమ్మక అది దేవుని నుండి వచ్చినదో లేదో అని నమ్మాలి అంటే ఈ దినములలో బైబిల్ ద్వారా మనతో మాట్లడే దేవుని గూర్చి మనము నిత్యము ధ్యానించాలి. ప్రతి రోజూ మనము దేవుని వాఖ్యాన్ని ధ్యానిస్తూ ఉంటె అది అయన ప్రత్యక్షత కాదో మనకు తెలియపరచబడుతుంది. ఆయనే వాఖ్యము.
Leave a Reply