ఈ రోజు రాఖీ పౌర్ణమీ కదా, చాలా మంది సోదరులు నన్ను ఈ ప్రశ్న అడిగారు. బ్రదర్ క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చునా? అని. సరే క్రైస్తవులుగా రాఖీ పండుగను ఆచరించవచ్చునా లేదో ఇప్పుడు అన్వేషిద్దాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగానే, హిందూ సాంప్రదాయములో ఆచరించే ప్రతి విషయములోను , పండుగలోను విగ్రహసంబంధమైన ఆచారాలు ఉంటాయి. మన ఇంటి ముందు వేసే ముగ్గు నుండి, చివరకు పెండ్లిలో కట్టే తాళి బొట్టు వరకు వీరు ఆచరించే ప్రతి విషయములోనూ వివిధ విగ్రహ సంబంధమైన ఆచారాలు, మూఢ విశ్వాసాలు ముడి పడి ఉంటాయి. అసలు ఈ రాఖీ పౌర్ణమీ అంటే ఏమిటి? హిందు సాంప్రదాయం ప్రకారం, శ్రావణమాసంలో రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు, ఉత్తర భారదేశంలో ఈ పండుగను రక్షాబంధన్ అని పిలుస్తారు. నిజానికి, భారతదేశములో రాఖీపౌర్ణమి ఎపుడు ప్రారంభమైందో, ఎలా ప్రారంభమైందో తెలిపే ఖచ్చితమైన ఆధారాలు లేవు. కానీ, పురాణాలలో తెలిపిన విధంగా, వివిధ రకాల కథలు ఉన్నాయి. వాటిలో కొన్ని ఇప్పుడు చూద్దాము.
ద్రౌపది -శ్రీకృష్ణుని బంధం:
భారతంలో శ్రీకృష్ణుడు, శిశుపాలుడనే దుర్మార్గుడిని వధించాలని అనుకుంటాడు. అందుకు సుదర్శన చక్రాన్ని ప్రయోగించే సమయంలో కృష్ణుడి చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసిన ద్రౌపది ఏ మాత్రం సంకోచించకుండా తక్షణమే తన చీర కొంగును చించి శ్రీకృష్ణుని వేలుకి రక్షగా చూడుతుంది. ‘‘నన్ను అన్నగా భావించి ఆదుకున్నావు. నీకు ఎలాంటి ప్రమాదం వచ్చినా నన్ను తలుచుకో!’’ అని అభయమిస్తాడు కృష్ణుడు. ఈ సంఘటనే రక్షాబంధనానికి నాందిగా నిలిచిందని అంటారు. కౌరవులు నిండు సభలో ద్రౌపది చీరను లాగి అవమానించాలని చూసినపుడు ఆమెకు అండగా నిలిచి అడ్డుకుని కృష్ణుడు కాపాడతాడు. గనుక ద్రౌపది కట్టిన చీర కొంగు, ద్రౌపదిని కౌరవుల నుండి కాపాడిందని, కనుక ఇప్పుడు కూడా సహోదరి రాఖీని తన సహోదరులకు కట్టినపుడు వారు కూడా తనను కాపాడుతారు అని భావించి నేడు హైందవ సహోదరీలు రాఖీ పండుగను ఆచరిస్తారు.
అలెగ్జాండర్ భార్య… పురుషోత్తముడి కథ:
చరిత్ర పుటల్లో అలెగ్జాండర్ భార్య ‘రోక్సానా’ తక్షశిల రాజు పురుషోత్తముడిని తన సోదరుడిగా భావించి రాఖీ కడుతుంది. జగజ్జేతగా మారాలనే తపనతో గ్రీకు యువరాజు అలెగ్జాండర్ క్రీస్తు పూర్వం 326లో భారత దేశంపై దండెత్తుతాడు. ఆ క్రమంలో బాక్ట్రియా (నేటి అప్ఘనిస్తాన్)కు చెందిన యువరాణి రోక్సానాను వివాహం చేసుకుంటాడు. ఆమె వివాహసంబంధాన్ని ఉపయోగించుకుని మధ్య ఆసియా దేశాలను, ముఖ్యంగా జీలం, చినాబ్ నదుల మధ్య ఉన్న రాజ్యాలను జయించాలని అలెగ్జాండర్ ఆలోచన. అలెగ్జాండర్ యుద్ధం ప్రకటిస్తాడు. పురుషోత్తముడి శత్రు రాజు అంబి, అలెగ్జాండర్‌ను భారతదేశంపై దండెత్తాలని ఆహ్వానిస్తాడు. పురుషోత్తముడు యుద్ధానికి సిద్ధమవుతాడు. అయితే అలెగ్జాండర్ భార్య రోక్సానా పురుషోత్తముడిని తన అన్నలా భావించి రాఖీ కడుతుంది. తన సోదరుడిని చంపవద్దని తన భర్త అయిన అలెగ్జాండర్‌ను కోరుతుంది. దీంతో అలెగ్జాండర్ యుద్ధం విరమించుకుంటాడు.
సంతోషిమాత దీవెన:
లోకమంతటా రక్షాబంధనాన్ని జరుపుకుంటోంది. కానీ వినాయకుని కుమారులకు రక్షాబంధనాన్ని కట్టేందుకు అక్కాచెల్లెళ్లు ఎవరూ లేరంట. దీంతో వారి వేదనను గమనించిన విఘ్నేశ్వరుడు, ‘సంతోషిమాత’ అనే దేవతను సృష్టించాడట. ఈ రాఖీ పౌర్ణమి రోజును జరుపుకునే సోదరీసోదరులందరినీ ఆ మాత చల్లగా చూస్తుందని చెబుతారు.
ఈ విధముగా చెప్పుకుంటూ పోతే పురాణాలలో, ఇతిహాసాలలో రాఖీ పౌర్ణమిని గూర్చి అనేక కధలు ఉన్నాయి. కనుక క్రైస్తవులమైన మనము అన్య దేవతలను, దేవుళ్ళను విశ్వసించకూడదు. మన దేవుడు చెబుతున్నట్లుగా భూలోకమందైనను, పరలోకమందైనను మనకు ఒక్కడే దేవుడు.
నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు నేను తప్ప ఏ దేవుడును లేడు.
యెషయా 45: 5
ఆకాశమందైనను భూమిమీదనైనను దేవతలనబడినవి యున్నను, మనకు ఒక్కడే దేవుడున్నాడు. ఆయన తండ్రి; ఆయననుండి సమస్తమును కలిగెను; ఆయన నిమిత్తము మనమున్నాము. మరియు మనకు ప్రభువు ఒక్కడే; ఆయన యేసుక్రీస్తు; ఆయనద్వారా సమస్తమును కలిగెను; మనము ఆయనద్వారా కలిగినవారము.
1కోరింథీయులకు 8:6
కొంతమంది నామకార్థ క్రైస్తవులు కూడా ఉన్నారు, వీరు రెండు పడవల మీద కాళ్ళు పెట్టి ప్రయాణము చేస్తూ ఉంటారు. విగ్రహ సంబంధమైన ఆచారాలను వదిలి పెట్టక, జీవముగల దేవునిని సంతోషపెట్టక అన్యజనులను సంతోషపెట్టాలని వారి ఆచారాలను సంప్రదాయాలను పాటిస్తూ ఉంటారు.
మరికొంతమంది, ఆచారము వెనుక ఉన్న విషయమును తెలుసుకొనక గ్రుడ్డిగా దారమే కదా బ్రదర్ కట్టించుకుంటున్నది ఇందులో విగ్రహారాధన ఏముంది అని వాదిస్తూ ఉంటారు. ఈ ఫిలాసఫీలు వినడానికి బాగుంటాయి గాని, దేవుని నీతిని నేరవేర్చలేవు.
ఇక చివరిగా క్రైస్తవులు రాఖీ పండుగను ఆచరించవచ్చునా ? అనే ప్రశ్నకు నా సమాధానం. చేసుకోకూడదు, జీవము గల దేవుడైనటువంటి యెహోవా మనకు ఏ అపాయము రాకుండా కాపాడును గాని, చేతికి కట్టుకొనే దారము మనలను కాపాడలేదు.
ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపాడును ఆయన నీ ప్రాణమును కాపాడును
కీర్తనలు 121:7
దేవుడు మిమ్మును దీవించును గాక.
Leave a Reply